నన్ను లేదా నా కుమారుడిని దూషిస్తే పాకిస్థాన్‌కు కప్ రాదు: కెప్టెన్ సల్మాన్ అఘా భార్య

  • ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన పాక్ జట్టుపై అభిమానుల ఆగ్రహం
  • సల్మాన్ అఘాతో పాటు అతడి కొడుకును లక్ష్యంగా చేసుకుని విమర్శలు
  • అభిమానులను ఉద్దేశించి సల్మాన్ అఘా ఆవేదన
తనను లేదా నా కుమారుడిని అసభ్యపదజాలంతో దూషించినంత మాత్రాన పాకిస్థాన్‌కు కప్ రాదని ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా భార్య అన్నది. టీ20 ప్రపంచకప్ సూపర్-8లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ పరాజయంపాలైంది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారాయి. జట్టు ఆటతీరుపై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాటింగ్‌లో సల్మాన్ అఘా విఫలమయ్యాడు.

దీంతో అభిమానులు సల్మాన్ అఘాతో పాటు అతడి కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వారి విమర్శలపై ఆవేదన చెందిన పాక్ కెప్టెన్ భార్య సబ్బా మన్జెర్ తమను లక్ష్యంగా చేసుకుంటే ఫలితం ఉండదని అభిమానులను ఉద్దేశించి పోస్టు పెట్టింది.

ఒక మ్యాచ్‌లో ఓడిపోయి, మరో మ్యాచ్ వర్షార్పణం కావడం వల్ల పాకిస్థాన్ ఖాతాలో ఒక పాయింట్ ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ కూడా 1 పాయింటుతో ఉంది. ఈరోజు కొలంబో వేదికగా శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 3 పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాక్ సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే.

ఒకవేళ శ్రీలంక చేతిలో కివీస్ ఓడిపోయినా పాక్‌కు ఇబ్బందులు తప్పవు. సూపర్ 8లో తన చివరి మ్యాచ్‌ను శ్రీలంకతో తలపడనుంది. మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఇంటి ముఖం పట్టాల్సిందే. ఈరోజు న్యూజిలాండ్‌పై శ్రీలంక గెలిచి, తర్వాత మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోతే నెట్ రన్ రేట్ కీలకం కానుంది. న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుతో ఓడిపోతేనే శ్రీలంక లేదా పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది.


More Telugu News