పోలవరం ఏజెన్సీలో మళ్లీ పులి కలకలం.. అప్రమత్తమైన అధికారులు

  • రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో పులి కదలికలు
  • అది ఇటీవల పట్టుకుని అడవిలో వదిలిన పులేనని నిర్ధారణ
  • గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
ఏజన్సీ ప్రాంతంలో పులి భయం ప్రజలను వీడటం లేదు. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల పట్టుకుని పాపికొండలు అభయారణ్యంలో విడిచిపెట్టిన పులే మళ్లీ జనారణ్యం వైపు వస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఈ పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించి, నిఘా ముమ్మరం చేశారు. 

కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశువులపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేసిన ఈ పులిని అటవీ అధికారులు ఈ నెల మొదటి వారంలో ఎంతో శ్రమించి బంధించారు. అనంతరం విశాఖపట్నం జూకు తరలించి, చికిత్స అనంతరం ప్రత్యేక కమిటీ నిర్ణయం మేరకు పాపికొండలు అభయారణ్యంలో పులిని సురక్షితంగా తిరిగి విడిచిపెట్టారు. అందుకు సంబంధించి వీడియోలను మీడియాకు విడుదల చేశారు. 

అయితే, అభయారణ్యంలో వదిలిన పది రోజుల్లోనే ఈ పులి మళ్లీ జనావాసాల సమీపంలోకి వచ్చింది. ప్రస్తుతం రంపచోడవరం మండలంలోని గెద్దాడ, చిలకమామిడి, బూసిగూడెం అటవీ ప్రాంతాలతో పాటు మారేడుమిల్లి పరిధిలోని పలు గ్రామాలకు సమీపంలో సంచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పులి సంచారంతో అటవీ శాఖ నిఘా పెంచింది. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. 

పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
 


More Telugu News