కొయ్యలగూడెం మండలంలో రవాణా సమస్యకు పవన్ పరిష్కారం

  • ఎర్రంపేట–రాజవరం మధ్య 3 కి.మీ. డొంక రోడ్డు నిర్మాణం పూర్తి
  • ఉపాధి హామీ పథకం నిధులతో మూడు నెలల్లో పూర్తి
  • రైతులకు, 12,500 మంది ప్రజలకు రవాణా సౌకర్యం
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. ఆయన ప్రత్యేక చొరవతో ఎర్రంపేట–రాజవరం గ్రామాల మధ్య 3 కిలోమీటర్ల డొంక రోడ్డు నిర్మాణం కేవలం మూడు నెలల్లోనే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

గతంలో ఈ దారి బురదమయంగా ఉండి, ప్రయాణానికి తీవ్ర ఇబ్బందికరంగా ఉండేది. స్థానికులు, రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్, ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నుంచి రూ.60 లక్షల నిధులు మంజూరు చేయించి పనులను వేగవంతం చేశారు.

ఈ రోడ్డు నిర్మాణంతో దాదాపు 12,500 మంది ప్రజలకు రవాణా కష్టాలు తీరాయి. ముఖ్యంగా రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఇకపై తమ పొలాలకు సులభంగా వెళ్లడంతో పాటు, వ్యవసాయ పరికరాలను తరలించడం, పండిన పంటను మార్కెట్‌కు వేగంగా, తక్కువ ఖర్చుతో చేరవేయడం వీలవుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పవన్ కల్యాణ్ పర్యవేక్షణ, అధికారుల సమన్వయంతోనే పనులు రికార్డు సమయంలో పూర్తయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఈ కొత్త రహదారితో గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.


More Telugu News