'ఏఐ సదస్సు'లో కాంగ్రెస్ నిరసన... 'ఇండియా' కూటమి నేతల విమర్శలు
- ప్రపంచ వేదికపై ఇలాంటి వైఖరి సరికాదన్న కూటమి నాయకులు
- అంతర్జాతీయ వేదికలు నిర్వహించినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ్యాఖ్య
- నిరసన తెలిపే హక్కు ఉంది కానీ వేదిక ఏది అనేది కూడా తెలుసుకోవాలని హితవు
అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరేట్ అల్వా అన్నారు. నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉందని, కానీ అంతర్జాతీయ సదస్సు సరైన వేదిక కాదని మరో కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు.
ఇలాంటి అంతర్జాతీయ వేదికలలో నిరసనలను తాను అంగీకరించనని మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం ఉందని, అయితే ఈ సదస్సులో నిరసనను సమర్థించమని ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా అన్నారు. నిరసనలకు వేదికలు వేరే ఉంటాయని వెల్లడించారు.
యువజన కాంగ్రెస్ నిరసనలకు శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీ దూరం పాటిస్తోంది. రాజకీయాల్లో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, కానీ వేదిక ఏది అనేది తెలుసుకోవాలని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అరవింద్ సావంత్ అన్నారు. ఏఐ ఇంపాక్ట్ వంటి అంతర్జాతీయ సదస్సు నిరసనలకు వేదిక కాకుండా ఉండాల్సిందని ఆదిత్య థాకరే అభిప్రాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్ ఐటీ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో కూడా సామాజిక మాధ్యమం వేదికగా యువజన కాంగ్రెస్ నాయకుల నిరసనను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, అదే సమయంలో వేదికను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. రాజకీయ విభేదాలు వేరు, దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసే అంతర్జాతీయ సదస్సు వేరు అని హితవు పలికారు.