మృతులకు రూ. 10 లక్షల పరిహారం.. కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం ప్రకటన

రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా నలుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ‌ శాసనసభలో ఈ విషయంపై ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తూ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనకు సంబంధించి నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీ నుంచి పాలు సరఫరా అయినట్లు సీఎం సభకు వివరించారు. ఇప్పటికే పాల నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ నివేదికలో పాలలో కల్తీ జరిగినట్లు తేలితే, అందుకు బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం 12 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరగా, వారిలో నలుగురు మరణించారని తెలిపారు. ప్రస్తుతం 8 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ దర్యాప్తులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Andhra Pradesh
Chandrababu
Rajahmundry
Adulterated Milk
Varalakshmi Dairy
Financial Assistance
AP Assembly
Satya Kumar Yadav
Narasapuram
Milk Adulteration Case

More Telugu News