జడల గెటప్‌లో నాని మాస్ డ్యాన్స్.. 'ది ప్యారడైజ్' నుంచి 'ఆయా షేర్' ప్రోమో వచ్చేసింది!

  • 'దసరా' తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో వస్తున్న చిత్రం
  • పండగల సీజన్‌లో ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • 8 భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో రానున్న 'ది ప్యారడైజ్'
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఆయా షేర్' అనే పాట ప్రోమోను చిత్రబృందం ఇవాళ‌ విడుదల చేసింది. ఈ ప్రోమోలో నాని రెండు జడల గెటప్‌లో మాస్ స్టెప్పులతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ కుమార్ సాహిత్యం అందించారు. అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుధ్ కలిసి ఆలపించారు. పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది.

నిజానికి ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని భావించినా, కొత్త తేదీగా ఆగస్టు 21ని ఖరారు చేశారు. ఈ కొత్త విడుదల తేదీ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. ఓనం, మిలాద్-ఉన్-నబీ, రక్షా బంధన్ వంటి పండగలు వరుసగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టేందుకు మంచి అవకాశం లభించనుంది.

బ్లాక్‌బస్టర్ హిట్ 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది ప్యారడైజ్'పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇటీవలే వందలాది మంది డ్యాన్సర్లతో నాని ఇంట్రడక్షన్ సాంగ్‌ను భారీ సెట్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు 'బిర్యానీ' అనే పాత్రలో, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ భాషల్లో కలిపి మొత్తం 8 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



More Telugu News