Ramachander Rao: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టు... కిషన్ రెడ్డి ఆగ్రహం

Ramachander Rao Arrested BJP President Protest Kishan Reddy
  • బాన్సువాడ, కామారెడ్డిలకు వెళ్లేందుకు ప్రయత్నించిన రామచందర్ రావు
  • ఉదయం నుంచి హౌస్ అరెస్టు, ఆ తర్వాత అరెస్టు చేసిన పోలీసులు
  • రామచందర్ రావు అరెస్టును ఖండించిన కిషన్ రెడ్డి
  • కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి, బాన్సువాడలకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించడంతో తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. రామచందర్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రామచందర్ రావును అరెస్టు చేసిన సమయంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

కామారెడ్డి జిల్లా  బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడకు వెళ్లేందుకు రామచందర్ రావు సిద్ధమయ్యారు. అదే సమయంలో కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వారు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్కడకు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి రామచందర్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు, ఆ తర్వాత అరెస్టు చేశారు.

రామచందర్ రావు అరెస్టును ఖండించిన కిషన్ రెడ్డి

రామచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. బాన్సువాడ, కామారెడ్డిలకు ఆయన వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని, ఇది ఆందోళనకరమని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో గెలిచినందుకు కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం సరికాదని అన్నారు.
Ramachander Rao
BJP Telangana
Kishan Reddy
Telangana BJP President Arrest
Banswada Clash

More Telugu News