Sake Sailajanath: అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయి?: శైలజానాథ్
- సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న శైలజానాథ్
- అర్ధరాత్రి 11.45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు భారీగా ఓట్లు నమోదయ్యాయని ఆరోపణ
- ఆత్మలు, దెయ్యాలు ఓట్లు వేశాయా? అని ప్రశ్న
మే 13న జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మాజీ మంత్రి, వైసీపీ నేత సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయని ప్రశ్నించారు.
పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి 11.45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు భారీగా ఓట్లు నమోదయ్యాయని శైలజానాథ్ అన్నారు. మొదట 68 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించారని... మూడు రోజుల తర్వాత 81.86 శాతం అని చెప్పారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 30 వేల టోకెన్లు (పోలింగ్ ముగింపు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఇస్తారు) మాత్రమే జారీ అయ్యాయని... మరి 50 లక్షల ఓట్లు ఎవరు వేశారని ప్రశ్నించారు. అర్ధరాత్రి ఆత్మలు, దెయ్యాలు వచ్చి ఓట్లు వేశాయా? అని ఎద్దేవా చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఈ అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.