ట్రంప్ సుంకాలకు సుప్రీంకోర్టులో బ్రేక్.. భారత సంతతి న్యాయవాది ఘన విజయం

  • ట్రంప్ ఏకపక్షంగా విధించిన సుంకాలను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు
  • భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ వాదనలతో ఏకీభవింపు
  • అధ్యక్షుడి కన్నా రాజ్యాంగమే గొప్పదని కోర్టు తీర్పులో వెల్లడి
  • చిన్న వ్యాపారులకు 175 బిలియన్ డాలర్ల రిఫండ్‌లు వచ్చే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన గ్లోబల్ టారిఫ్‌లకు (సుంకాలకు) వ్యతిరేకంగా జరిగిన న్యాయపోరాటంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ చారిత్రాత్మక విజయం వెనుక భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది, అమెరికా మాజీ యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ నీల్ కత్యాల్ పోరాటం ఉంది.

షికాగోలో భారత వలస దంపతులకు జన్మించిన నీల్ కత్యాల్, అమెరికాలో అత్యంత ప్రతిభావంతులైన న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. బరాక్ ఒబామా హయాంలో ప్రభుత్వ ఉన్నత న్యాయవాదిగా పనిచేసిన ఆయన, సుప్రీంకోర్టులో 50కి పైగా కేసుల్లో వాదనలు వినిపించారు. తాజా కేసులో చిన్న వ్యాపార సంస్థల తరఫున వాదించిన కత్యాల్, అమెరికాలో పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి కాకుండా ప్రజల ప్రతినిధులతో కూడిన కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని బలంగా వాదించారు.

ఈ తీర్పుపై కత్యాల్ స్పందిస్తూ "అధ్యక్షులు శక్తిమంతులే కావచ్చు, కానీ మన రాజ్యాంగం అంతకంటే శక్తిమంతమైనది. వలసదారుడి కొడుకుగా నేను కోర్టుకు వెళ్లి, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి చర్యను సవాలు చేయగలిగాను" అని వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో అమెరికాలోని వేలాది చిన్న వ్యాపార సంస్థలకు దాదాపు 175 బిలియన్ డాలర్ల వరకు పన్ను రిఫండ్‌లు పొందే అవకాశం ఏర్పడింది. ట్రంప్ యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాల్లో సుంకాలు విధించే ప్రయత్నాలు చేస్తుండగా, వాటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు కత్యాల్ సిద్ధమవుతున్నారు.


More Telugu News