ఢిల్లీ ఏఐ సదస్సులో 8 ఏళ్ల బాలుడి ప్రసంగం.. అబ్బురపడిన టెక్ దిగ్గజాలు!

ఢిల్లీలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026'లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. గ్లోబల్ టెక్ కంపెనీల సీఈవోలు, విధానకర్తలు పాల్గొన్న ఈ సదస్సులో రణవీర్ సింగ్ సచ్‌దేవా అతి పిన్న వయస్కుడైన 'కీనోట్ స్పీకర్'గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రానికి, ఆధునిక కృత్రిమ మేధకు (AI) మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ అతడు చేసిన ప్రసంగం అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

భారతీయ ఏఐ నమూనాలతో దేశ జీడీపీని ఎలా వృద్ధి చేయవచ్చో కూడా రణవీర్ తనదైన శైలిలో వివరించి చప్పట్లు అందుకున్నాడు. 2017లో జన్మించిన ఈ బాల మేధావి, కేవలం మూడేళ్లకే వర్గమూలాలు, ఘనమూలాలు అలవోకగా చెప్పేవాడు. ఐదేళ్లకే 'యాపిల్ స్విఫ్ట్ ప్రోగ్రామర్‌'గా మారి, యాపిల్ సీఈవో టిమ్ కుక్ నుంచి వ్యక్తిగత ఆహ్వానాన్ని అందుకున్నాడు.

ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన టెడెక్స్ (TEDx) స్పీకర్‌గా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ఆహ్వానం అందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా రణవీర్ రికార్డులు సృష్టించాడు. ఏఐ బాధ్యతాయుత వినియోగంపై అతడు రాసిన 'ఆర్ యూ బోర్న్ విత్ ఏఐ?' అనే పుస్తకాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ప్రశంసించడం విశేషం.

ప్రస్తుతం రణవీర్ ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 'మెషీన్ లెర్నింగ్' కోర్సు అభ్యసిస్తున్నాడు. ఈ సదస్సులో భాగంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మాన్ వంటి దిగ్గజాలతో సమావేశమై తన ఆలోచనలను పంచుకున్నాడు. సాంకేతిక రంగంలో భారత్ భవిష్యత్తుకు రణవీర్ లాంటి యువ ప్రతిభావంతులు ఒక సజీవ నిదర్శనంగా నిలుస్తున్నారు.

Ranveer Singh Sachdeva
India AI Impact Summit 2026
AI
Artificial Intelligence
Tim Cook
Sundar Pichai
Sam Altman
United Nations
Indian GDP

More Telugu News