ట్రంప్ 'టారిఫ్'లకు అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్.. భారత ఎగుమతిదారులకు భారీ ఊరట!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ సుంకాలను (టారిఫ్స్) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు తక్షణమే భారీ ఊరట లభించినట్లయింది.

1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట్టుకుని సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్ పరిధిలోని అంశమని 6-3 మెజారిటీతో తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ ఏకపక్ష వాణిజ్య నిర్ణయాలకు అడ్డుకట్ట పడింది.

సుప్రీంకోర్టు తీర్పు భారత వాణిజ్య వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే వస్తువులపై 18 శాతం సుంకం విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదన తాజా తీర్పుతో చెల్లకుండా పోయింది. అంతేకాకుండా, ఇప్పటివరకు అక్రమంగా వసూలు చేసిన పన్నులను తిరిగి పొందేందుకు భారత కంపెనీలకు అవకాశం లభించనుంది. ఫలితంగా అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల పోటీతత్వం పెరగనుంది.

అయితే, ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దీనిని 'సిగ్గుచేటు'గా అభివర్ణించిన ఆయన, మరో చట్టంలోని సెక్షన్ 122 కింద అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తానని ప్రకటించారు. అదే సమయంలో భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ టారిఫ్‌లు చెల్లించాల్సిందేనని ఆయన నొక్కిచెప్పడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతానికి ఊరటనిచ్చినా, ట్రంప్ తాజా హెచ్చరికలతో వాణిజ్య రంగంలో కొంత అనిశ్చితి నెలకొంది.

Donald Trump
US Supreme Court
tariffs
India exports
trade agreement
global tariff
Import Export
economic policy
IEEPA
trade war

More Telugu News