తిరుమల వెళ్లినప్పుడు జగన్ చెప్పులతోనే ఆలయం అంతా తిరిగారు: అచ్చెన్నాయుడు

  • మండలిలో శ్రీవారి చిత్రాలతో వైసీపీ ఎమ్మెల్సీల నిరసన
  • టీటీడీ నెయ్యి అంశంపై చర్చకు అనుమతించకపోవడమే కారణం
  • చెప్పులు వేసుకుని చిత్రాలు పట్టుకున్నారని అధికార పక్షం ఆరోపణ
  • ఆరోపణలను ఖండించిన వైసీపీ.. ఆధారాలు చూపించాలని సవాల్
  • గతంలో జగన్, ఇప్పుడు ఎమ్మెల్సీలు అంటూ అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం తీవ్ర గందరగోళం, వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీవారి చిత్రపటాలను చేతబట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగడం పెద్ద వివాదానికి దారితీసింది. చెప్పులు, బూట్లు ధరించే వారు స్వామివారి చిత్రాలను పట్టుకుని సభలో అపవిత్రంగా ప్రవర్తించారని, ఇది 'మహాపచారం' అని అధికార పక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ గందరగోళం మధ్య శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను వాయిదా వేశారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై చర్చకు తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు శ్రీవారి చిత్రాలను ప్రదర్శించారు. 

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. "గతంలో తిరుమల వెళ్ళినప్పుడు జగన్ చెప్పులతోనే ఆలయ ప్రాంగణం అంతా తిరిగాడు. ఈరోజు వైసీపీ నేతలు మండలిలో చెప్పులు, బూట్లు వేసుకునే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకున్నారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకుని హిందువులకు క్షమాపణలు కోరాల్సింది పోయి, అడ్డంగా అబద్దాలు చెబుతూ ఛాలెంజ్‌లు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి?" అని ఆయన ప్రశ్నించారు.

మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వైసీపీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. తమ సభ్యులు చెప్పులతో చిత్రపటాలను పట్టుకున్నారని నిరూపించాలని, ఒక్క ఆధారం చూపాలని సవాల్ విసిరారు. దీనికి స్పందనగా, ఎమ్మెల్సీలు చెప్పులతో ఉన్నారనడానికి కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 




More Telugu News