Iran: గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉద్రిక్తత.. ఇరాన్-రష్యా సంయుక్త విన్యాసాలు

Iran Russia Joint Military Drills Heighten Tensions in Gulf of Oman
  • అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు
  • అణు ఒప్పందంపై ఇరాన్‌కు 10 రోజుల గడువిచ్చిన ట్రంప్
  • రష్యాతో కలిసి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్ నౌకాదళ విన్యాసాలు
  • మధ్య ప్రాచ్యానికి ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకను పంపిన అమెరికా
  • ఇరాన్‌పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఒకవైపు అమెరికా భారీ సైనిక బలగాలను మోహరిస్తుండగా, మరోవైపు రష్యాతో కలిసి ఇరాన్ సంయుక్త విన్యాసాలు చేపట్టడంతో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అణు ఒప్పందంపై తేల్చుకోవడానికి ఇరాన్‌కు 10 నుంచి 15 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ గడువులోగా ఒప్పందం కుదరకపోతే ‘చాలా దారుణమైన పరిణామాలు’ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తన హెచ్చరికలకు బలం చేకూరుస్తూ, ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో ఉన్న 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' నౌకకు అదనంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్'ను కూడా ఆ ప్రాంతానికి పంపారు. దీంతోపాటు బి-2 స్టీల్త్ బాంబర్లను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్, రష్యా నౌకాదళాలు గల్ఫ్ ఆఫ్ ఒమన్, హిందూ మహాసముద్ర ఉత్తర భాగంలో భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. సముద్రంలో హైజాక్ అయిన నౌకను రక్షించే ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో ఇరాన్‌కు చెందిన 'అల్వాంద్' డిస్ట్రాయర్, క్షిపణి నౌకలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి.

అమెరికా సైనిక మోహరింపు తీరు చూస్తుంటే ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు జరగొచ్చని సీఎన్ఎన్, యాక్సియోస్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. తొలుత ఇరాన్ అణు కేంద్రాలపై పరిమిత దాడులు చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయి యుద్ధానికి దిగే వ్యూహంలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలాండ్ వంటి దేశాలు తమ పౌరులను తక్షణమే ఇరాన్ విడిచి వెళ్లాలని సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జెనీవా చర్చల్లో పురోగతి ఉందని ఇరాన్ చెబుతున్నా, 'చర్చించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని' అమెరికా పేర్కొంది. ఇరాన్ యురేనియం శుద్ధిని నిలిపివేస్తేనే ఆంక్షలు ఎత్తివేస్తామని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
Iran
Iran Russia military exercises
Gulf of Oman
US Iran tensions
Donald Trump
Middle East conflict
USS Abraham Lincoln
USS Gerald R Ford
Nuclear deal
Military deployment

More Telugu News