K Kavitha: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే..: కవిత కీలక ప్రకటన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో 'తెలంగాణ' ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత అన్నారు.

హైదరాబాద్‌లోని జాగృతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్ణాటకలోని దావణగెరెకు తరలించి అన్యాయం చేశారని అన్నారు.

స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత తెలిపారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే యూనియన్లను రద్దు చేశారని ఆరోపించారు. కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు. అధికారంలోకి వస్తే యూనియన్లను తిరిగి ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఈ నెల 24న తలపెట్టిన చలో సెక్రటేరియట్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
K Kavitha
K Kavitha new party
Telangana party
Siddipet constituency
Bodhan constituency
Telangana Jagruthi

More Telugu News