Nara Lokesh: నిరుద్యోగులకు 'ఉగాది' కానుక: ఏపీలో మరో మెగా డీఎస్సీకి రంగం సిద్ధం!

AP DSC Notification Expected on Ugadi Announces Nara Lokesh
  • ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
  • మొత్తం 3,600 ఖాళీల భర్తీ
  • పాత సిలబస్‌తోనే పరీక్ష నిర్వహణ
  • స్పెషల్ టీచర్లకు వెయిటేజీ అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ హామీ మేరకు మరో నోటిఫికేషన్‌కు విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. రాబోయే ఉగాది పండగ సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

పాఠశాల విద్యాశాఖ సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.  వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, సంక్షేమ పాఠశాలలు: 1,200 పోస్టులు.
ప్రభుత్వ, పంచాయతీరాజ్, పురపాలక పాఠశాలలు: 1,700 పోస్టులు.
స్పెషల్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) పోస్టులు: 700 వరకు.


గత ఏడాది ఏప్రిల్‌లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులను కూడా ఇందులో కలిపే అవకాశం ఉంది.

కొత్త డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత డీఎస్సీకి అనుసరించిన సిలబస్, మార్గదర్శకాలనే ఈసారి కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులకు సమయం తక్కువగా ఉన్నందున, తొలుత భావించిన 'ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ', 'కంప్యూటర్ టెస్టులను' ప్రస్తుతానికి వాయిదా వేశారు.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఒప్పంద ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెయిటేజీ ఇచ్చే దిశగా ఆలోచిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పదేళ్ల సర్వీసు ఉండి టెట్ పాసైన సుమారు 800 మందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయనున్నారు. వీరు శాశ్వత ఉద్యోగం సాధించాలంటే డీఎస్సీ రాయాల్సి ఉంటుంది. అయితే వీరికి కొంత వెయిటేజీ ఇచ్చే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ ప్రక్రియ తుది దశలో ఉంది. ఉగాది నాటికి పోస్టుల సంఖ్యలో స్వల్ప మార్పులు (పెరిగే అవకాశం) ఉండవచ్చు.
Nara Lokesh
AP DSC
DSC Notification
Teachers Jobs
Andhra Pradesh Education
Government Jobs
Model Schools
Special Education
AP DSC Syllabus
Teacher Recruitment

More Telugu News