సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌ను ఐసీయూకి తరలించిన వైద్యులు

  • ప్రముఖ రచయిత, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌కు అస్వస్థత
  • ముంబైలోని లీలావతి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
  • ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడి
  • షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఆసుపత్రికి చేరుకున్న సల్మాన్ ఖాన్
  • బుధవారం అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న వైద్యులు
బాలీవుడ్ ప్రముఖ రచయిత, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ (90) అస్వస్థతకు గురవడం తెలిసిందే. ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించారు. 

మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో సలీం ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు తెలిపారు. శరీరంలో వాపు ఉన్నట్టు గుర్తించడంతో కుటుంబ వైద్యుడి సలహా మేరకు ఆయన్ను ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఐసీయూకి మార్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే నిపుణులైన వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు.

విషయం తెలియగానే సల్మాన్ ఖాన్ మడ్ ఐలాండ్‌లో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను మధ్యలోనే ఆపేసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు కుమార్తెలు అల్విరా ఖాన్, అర్పితా ఖాన్, అల్లుడు ఆయుష్ శర్మ కూడా ఆసుపత్రికి వచ్చారు. కుటుంబ సభ్యుల గోప్యతకు గౌరవమిస్తూ ఆరోగ్య వివరాలను వెల్లడించడం లేదని, బుధవారం ఉదయం 11 గంటలకు అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు ప్రకటించారు.

జావేద్ అక్తర్‌తో కలిసి ‘సలీం-జావేద్’ ద్వయంగా సలీం ఖాన్ భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు. 'షోలే', 'దీవార్', 'జంజీర్', 'డాన్' వంటి ఎన్నో ఐకానిక్ చిత్రాలకు ఆయన కథలను అందించారు.


More Telugu News