విజయవాడలో రౌడీషీటర్ అంతిమయాత్రలో అనుచరుల హల్ చల్

  • ఆటో నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన రౌడీషీటర్ పండు అలియాస్ పావురం
  • అంతిమయాత్రలో భారీగా పాల్గొని హాల్ చల్ చేసిన అనుచరులు
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
  • కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు
విజయవాడ నగరంలో రౌడీషీటర్లు హల్‌చల్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ పండు అలియాస్ పావురం అంతిమయాత్రను అతని అనుచరులు భారీ ఎత్తున నిర్వహించడం నగరంలో అలజడికి దారితీసింది. సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన పండు అంత్యక్రియల సందర్భంగా వందలాది మంది రౌడీషీటర్లు రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. 

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భవానీపురం పొలం వరకు జరిగిన ఈ ఊరేగింపులో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా సింగ్ నగర్, పటేల్ నగర్, జక్కంపూడి వంటి ప్రాంతాలకు చెందిన కీలక రౌడీషీటర్లు, వారి అనుచరులు ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ అంతిమయాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బహిరంగంగా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు గాను పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఒక డీజే వాహనాన్ని, 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కృష్ణలంకకు చెందిన నవీన్ సాయి, సూర్య కోడి మరికొందరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.



More Telugu News