Karimnagar Corporation: మేయర్ పీఠం ఎవరిది? కరీంనగర్‌లో రసవత్తరంగా మారిన రాజకీయం

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పలువురు స్వతంత్ర, ఇతర పార్టీల కార్పొరేటర్లు కాంగ్రెస్‌కు మద్దతు పలకడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు సాయిజ్యోతి, శ్యామలతో పాటు, స్వతంత్రులుగా గెలిచిన కొమరయ్య, నందిని ఉదయ్, మల్లేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తంగా ఐదుగురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. హైదరాబాద్‌లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఇదే సమయంలో, ఎంఐఎంకు చెందిన ముగ్గురు కార్పొరేటర్లతో పాటు, మరో స్వతంత్ర అభ్యర్థి మాజీద్ హుస్సేన్ కూడా కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

"కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తాము బలంగా నమ్ముతున్నామని, అభివృద్ధిని ఆకాంక్షించే కాంగ్రెస్‌లో చేరామని" పార్టీలో చేరిన కార్పొరేటర్లు తెలిపారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల ప్రకారం బీజేపీ 30 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 సీట్లు సాధించాయి. మిగిలిన సీట్లు ఇండిపెండెంట్లు, ఎఐఎఫ్‌బీ వంటి చిన్న పార్టీలు గెలుచుకున్నాయి. మొత్తం కార్పొరేషన్ బలం 69 (66 ఎన్నికైన సభ్యులు + 3 ఎక్స్అఫీషియో సభ్యులు). మేయర్ పదవికి అవసరమైన మెజారిటీ మార్క్ 35.

తాజా పరిణామాలతో కాంగ్రెస్ బలం పెరిగింది. అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ బీజేపీకి మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేదు. దీంతో మేయర్ పీఠం కోసం పోరు హోరాహోరీగా మారింది. మిగిలిన స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Karimnagar Corporation
Sridhar Babu
Ponnam Prabhakar
Karimnagar Mayor Election
Telangana Politics
Congress Party
BJP
AIMIM
Independent Corporators

More Telugu News