Bandi Sanjay: కుట్రలు చేస్తే... మీ అందరినీ రాజకీయ సమాధి చేస్తా: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆ మూడు పార్టీలకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని వ్యగ్యంగా అన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ... మేయర్ పీఠం దక్కించుకుంటామని కాంగ్రెస్, బీఆర్ఎస్ చెబుతున్నాయని... ఏ విధంగా దక్కించుకుంటాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటే అనే విషయం కరీంనగర్ వేదికగా బయటపడుతోందని చెప్పారు. 

కరీంనగర్ మేయర్ పీఠం తమదేనని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తే... కరీంనగర్ నుంచే యుద్ధాన్ని ప్రారంభిస్తానని హెచ్చరించారు. వారందరినీ రాజకీయ సమాధి చేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తల శక్తి, దమ్ము మీకు తెలియదు అని అన్నారు. 

కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి కేవలం 13 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చిందని సంజయ్ తెలిపారు. అందుకే, ఈ విజయాన్ని ఇంటెలిజెన్స్ కే అంకితమిస్తున్నామని అన్నారు. మేయర్ పదవి కోసం గుంటనక్కలన్నీ ఏకమయ్యాయని మండిపడ్డారు. బీజేపీ సింహమని, సింగిల్ గానే వస్తుందని చెప్పారు.

మరోవైపు, కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా... బీజేపీ 30 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాలకే పరిమితమయ్యాయి. ఈ నెల 16న కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం ఉంటుంది.
Bandi Sanjay
Karimnagar
BRS
Congress
MIM
Telangana Politics
Mayor Election
BJP
Revanth Reddy
Political Conspiracy

More Telugu News