Andhra Pradesh Government: అడవుల్లోని గిరిజన గ్రామాలకు ‘సంజీవని’ డ్రోన్లు.. ఏపీలో సరికొత్త వైద్య సేవలు!

Andhra Pradesh Government Sanjeevani Drones Deliver Healthcare to Tribal Villages
  • సరైన రవాణా సదుపాయం లేని గ్రామాలకు ప్రాణదాతలుగా డ్రోన్లు
  • 20 నిమిషాల్లోపే అత్యవసర మందుల సరఫరా
  • రెడ్ వింగ్ సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం సరికొత్త సేవలు
గిరిజన ప్రాంతాల్లోని పేదలకు ఆధునిక వైద్య సేవలను చేరువ చేసే దిశగా సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 'సంజీవని' మెడికల్ డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును అల్లూరి సీతారామరాజు జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. వాగులు, వంకలు, కొండలు, కోనలు దాటుకుని ఆసుపత్రులకు వెళ్లే గిరిజన గ్రామాల ప్రజలకు ఇప్పుడు ఈ డ్రోన్లు ప్రాణదాతలుగా మారాయి. 

అల్లూరి జిల్లాలోని 2,191 గిరిజన గ్రామాలకు సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో... అత్యవసర పరిస్థితుల్లో రోగులను, గర్భిణులను డోలీల ద్వారా కిలోమీటర్ల దూరం మోసుకెళ్లడం జరుగుతోంది. ఈ ప్రయాణంలో జరిగే ఆలస్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండటం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన రెడ్ వింగ్ సంస్థతో కలిసి డ్రోన్ల సేవలను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. 

ఆసుపత్రులకు వెళ్లడానికి గంటల సమయం పట్టే ప్రాంతాలకు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే అత్యవసర మందులను డ్రోన్లు అందజేస్తాయి. ఇవి సాధారణ డ్రోన్ల మాదిరి కాకుండా... శాటిలైట్ ట్రాకింగ్ తో ఆటోమేటెడ్ సాఫ్ట్ వేర్ తో పనిచేస్తాయి. 5 కేజీల బరువున్న మెడిసిన్స్, వ్యాక్సిన్స్, బ్లడ్ ప్యాకెట్స్, పాము కాటు మందులను చేరవేయడమే కాకుండా, అక్కడి రోగుల రక్త నమూనాలను పరీక్షల కోసం తిరిగి ఆసుపత్రికి తీసుకొస్తాయి. దీనివల్ల సకాలంలో వైద్యులు చికిత్స అందించడం సాధ్యమవుతుంది. పాడేరు డిగ్రీ కాలేజీని ప్రధాన హబ్ గా చేసుకుని ఈ డ్రోన్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.  
Andhra Pradesh Government
Sanjeevani drone
medical drone
Alluri Sitarama Raju district
tribal villages
healthcare
Redwing
medicine delivery
remote areas
drone services

More Telugu News