'సర్వం ఏఐ'.. ప్రపంచ దేశాలకు పోటీగా భారత్ స్వదేశీ ఏఐ
- దేశాల మధ్య శక్తి పోరాటంగా మారిన ఏఐ
- డిజిటల్ ప్రపంచంపై ఆధిపత్యం కోసం పోటీ
- 'సర్వం ఏఐ'ని రూపొందిస్తున్న భారత్
కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు... ఇది దేశాల మధ్య శక్తి పోరాటంగా మారింది. ఎవరు అత్యాధునిక ఏఐ వ్యవస్థలను తయారు చేస్తారు? ఎవరి నియంత్రణలో భవిష్యత్ డిజిటల్ ప్రపంచం ఉంటుంది? అన్న ప్రశ్నల చుట్టూ ప్రపంచ శక్తులు పోటీ పడుతున్నాయి. అమెరికా, చైనా, యూరప్, భారత్... ఈ నాలుగు శక్తులు నాలుగు విధానాలతో ముందుకు సాగుతున్నాయి. తాజాగా 'సర్వం ఏఐ' (Sarvam AI) మోడల్ తో భారత్ కూడా ఈ పోటీలో తనదైన పంథాను ఎంచుకుంది.
భారత్ ఇప్పుడే పూర్తి స్థాయి ఏఐ శక్తిగా ఎదగకపోయినా, వేగంగా ముందుకు సాగుతోంది. స్టాన్‌ఫర్డ్ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ర్యాంకింగ్స్ ప్రకారం అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఏఐని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, భారతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వడం, సామాజిక సమస్యలకు పరిష్కారాలు, 22 షెడ్యూల్ భాషలకు మద్దతు, విదేశీ ఏఐపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, 'బుల్ బుల్ వీ3' వంటి భాషా మోడళ్లను అభివృద్ధి పరచడం వంటి లక్ష్యలతో భారత్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే 'సర్వం ఏఐ' ప్రారంభమయింది. భారతీయ అవసరాలకు పూర్తిగా సరిపోయే ఏఐగా ఇది రూపొందుతోంది.