Bandi Sanjay: మహదేవప్పది ఆత్మహత్య కాదు... కాంగ్రెస్ చేసిన హత్య: బండి సంజయ్

Bandi Sanjay Calls Mahadevappa Death a Congress Murder
షార్ట్స్‌లో చూడండి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

మహదేవప్ప ఆత్మహత్యపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మహదేవప్పది ఆత్మహత్య కాదని... కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు, అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా భూస్థాపితం చేసే రోజులు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని రాళ్లతో కొట్టే రోజులు రాబోతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటిస్తామని చెప్పారు. 

బీజేపీ కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, బీజేపీ నాయకత్వం వారికి అండగా ఉంటుందని సంజయ్ తెలిపారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందిస్తూ... మహదేవప్ప ఆత్మహత్య తనను కలచివేసిందని అన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Bandi Sanjay
Mahadevappa
Telangana Politics
Maktal Municipality
BJP Candidate
Municipal Elections
Congress Party
Suicide Case
Ramchander Rao
Telangana BJP

More Telugu News