ఆ పుస్తకం మేం పబ్లిష్ చేయలేదు.. నరవణె బుక్ పై పెంగ్విన్ సంస్థ వివరణ
- ఏ రూపంలోనూ రిలీజ్ చేయలేదన్న సంస్థ
- బుక్ పై అన్ని హక్కులు తమకే ఉన్నాయని వెల్లడి
- ఇటీవల నరవణె బుక్ ను పార్లమెంట్ లో ప్రదర్శించిన రాహుల్ గాంధీ
పార్లమెంట్ లో ప్రదర్శించిన రాహుల్ గాంధీ..
సరిహద్దుల్లో చైనా సైన్యంతో జరిగిన భారత బలగాల ఘర్షణకు సంబంధించి నరవణె ఈ పుస్తకంలో పలు విషయాలను వెల్లడించారు. ఈ వివాదాస్పద అంశాలను రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే, నరవణె పుస్తకం అసలు పబ్లిష్ కాలేదని, మార్కెట్లోకి రాని పుస్తకంలోని విషయాలను సభలో ప్రస్తావించడమేంటని అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మరుసటి రోజు రాహుల్ గాంధీ నరవణె బుక్ ను సభకు తీసుకెళ్లారు. దీంతో వివాదం రేగింది. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వకుండా మాజీ సైన్యాధిపతి రాసిన పుస్తకం ఎలా పబ్లిష్ అయిందనే ప్రశ్నలు ఉదయించాయి.
ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు..
ఈ వివాదం నేపథ్యంలో నరవణె పుస్తకం ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. పీడీఎఫ్ ఫార్మాట్లో పలు సైట్లలో అందుబాటులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో పెంగ్విన్ సంస్థ ప్రచురణకు ముందు రూపొందించిన పీడీఎఫ్ ప్రతి కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉందని గుర్తించినట్లు తెలిపారు.