TTD: శ్రీవారి దర్శనం సమయంలో పోయిన గొలుసు.. గంటల్లోనే గుర్తించి అందించిన విజిలెన్స్

తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తమ అప్రమత్తతను చాటుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గంటల వ్యవధిలోనే గుర్తించి సురక్షితంగా తిరిగి అప్పగించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, డి. కోటేశ్వరరావు అనే భక్తుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్తున్న సమయంలో ఆయన భార్య మెడలోని బంగారు గొలుసు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని వారు గమనించకుండా ముందుకు వెళ్లిపోయారు.

కొద్దిసేపటి తర్వాత గొలుసు పోయినట్లు గుర్తించిన కోటేశ్వరరావు, వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై టీటీడీ సీవీఎస్‌ఓ మురళీకృష్ణ వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాలతో వీఎస్‌ఓలు రాం కుమార్, సురేంద్ర పర్యవేక్షణలో ఏవీఎస్‌ఓ చిరంజీవి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, గొలుసు పడిపోయిన ప్రదేశాన్ని గుర్తించారు. అనంతరం దానిని భద్రంగా స్వాధీనం చేసుకుని భక్తురాలికి అందజేశారు.

వేగంగా స్పందించి, పోయిన ఆభరణాన్ని తిరిగి అప్పగించిన విజిలెన్స్ సిబ్బందిని సీవీఎస్‌‌వో మురళీకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. తమ గొలుసు తిరిగి దొరకడంతో భక్తుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
TTD
Tirumala
TTD Vigilance
Vaikuntam Queue Complex
Lost gold chain
Koteswara Rao
Murali Krishna
Tirupati
Andhra Pradesh

More Telugu News