Chinnajeeyar Swamy: శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడు.. చినజీయర్ వ్యాఖ్యలతో దుమారం

Chinnajeeyar Swamy Remarks Spark Controversy on Adishankaracharya
  • ఆదిశంకరాచార్యులపై చినజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
  • చతురామ్నాయ పీఠాలను శంకరులు స్థాపించలేదని వ్యాఖ్య
  • చినజీయర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శివస్వామి
  • బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • వైష్ణవులు, శైవుల మధ్య చిచ్చు పెట్టొద్దని హితవు
జగద్గురు ఆదిశంకరాచార్యులపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆదిశంకరాచార్యులు చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదని, ఆయన శుద్ధ వైష్ణవుడని చినజీయర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో జరుగుతున్న సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చినజీయర్ స్వామి తన ప్రవచనంలో "శంకరాచార్యులు పూరీ, ద్వారక, జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను ఏర్పాటు చేయలేదు. ఆయన 32 ఏళ్లకే హిమాలయాలకు వెళ్లి తిరిగి రాలేదు. 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య స్థాపనకు మార్గనిర్దేశం చేసిన విద్యారణ్య స్వామి ఈ నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు. విదేశీ దండయాత్రల నుంచి హిందూ ధర్మాన్ని రక్షించేందుకు శైవం, వైష్ణవం వంటి అన్ని మార్గాల వారిని ఏకం చేయడానికి ఆయన పంచాయతనాన్ని పరిచయం చేశారు. ఆదిశంకరాచార్యులు ఉత్తమ వైష్ణవుడు, నారాయణ పరాయణుడు" అని వివరించారు.

అయితే, చినజీయర్ వాదనపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1380-86 మధ్య శృంగేరి పీఠానికి విద్యారణ్య స్వామి 12వ పీఠాధిపతిగా ఉన్నారని, ఆయన కంటే ముందే ఆ పీఠం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని పలువురు గుర్తుచేస్తున్నారు.

క్షమాపణ చెప్పాలి: శివస్వామి
చినజీయర్ వ్యాఖ్యలపై అమరావతి శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. చినజీయర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శైవులు, వైష్ణవుల మధ్య చిచ్చుపెట్టి హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదని హితవు పలికారు. క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆగదని, చినజీయర్‌ను ప్రశాంతంగా ఉండనివ్వమని హెచ్చరించారు. ఇదే సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం అంశాన్ని కూడా శివస్వామి ప్రస్తావిస్తూ, దీనిపై విచారణను స్వాగతిస్తున్నామన్నారు.
Chinnajeeyar Swamy
Adishankaracharya
Chinajeeyar comments
Hindu Dharma
Srivaishnava
Amaravati Srisailam
Sivami
சமதா கும்ப பிரம்மோத்சவங்கள்
Vidhyaranya Swami
Sringeri Peetham

More Telugu News