Rahul Gandhi: 'మిత్ర ద్రోహి' కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తావ్ అన్న రాహుల్ గాంధీ.. మీరే దేశద్రోహులంటూ కేంద్రమంత్రి కౌంటర్

Rahul Gandhi calls Ravneet Singh Bittu traitor
  • పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్న సమయంలో అనూహ్య ఘటన
  • ద్రోహి నడుచుకుంటూ వెళుతున్నాడని రాహుల్ గాంధీ వ్యాఖ్య
  • మీరు దేశానికి ద్రోహం చేశారంటూ కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కౌంటర్
  • రాహుల్ గాంధీతో కరచాలనానికి నిరాకరణ
పార్లమెంటు ఆవరణలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది. అడుగో 'మిత్ర ద్రోహి' అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, 'మీరు దేశ ద్రోహులు' అంటూ కేంద్రమంత్రి కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

రవ్‌నీత్ సింగ్ బిట్టు మూడుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పని చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు.

మకరద్వారం వద్ద కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. అదే సమయంలో అటుగా కేంద్రమంత్రి వెళుతున్నారు. ఆయనను ఉద్దేశించి రాహుల్ గాంధీ "ఇదిగో ఒక ద్రోహి నడుచుకుంటూ వెళుతున్నారు, చూడండి" అని అన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కేంద్రమంత్రితో కరచాలనం చేయడానికి ముందుకు వస్తూ, "హలో సోదరా, నా మిత్ర ద్రోహి. డోంట్ వర్రీ. మీరు తిరిగి కాంగ్రెస్ లోకే వస్తారు" అని వ్యాఖ్యానించారు. 

అయితే, రాహుల్ గాంధీతో కరచాలనానికి నిరాకరించిన కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, "మీరు దేశానికి ద్రోహం చేశారు.. మీరు దేశ ద్రోహులు" అని కౌంటర్ ఇచ్చారు. ఏదో యుద్ధంలో గెలిచినట్లు కూర్చుని నిరసన తెలుపుతున్నారంటూ ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి కేంద్రమంత్రి అన్నారు. దీంతో ఇరువురి మాటల యుద్ధం నడిచింది.

అందుకే కరచాలనం తిరస్కరించా

తాను రాహుల్ గాంధీతో కరచాలనం నిరాకరించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు. 1984లో స్వర్ణ దేవాలయం కాంప్లెక్స్ నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టడానికి నిర్వహించిన సైనిక ఆపరేషన్ బ్లూస్టార్, సిక్కు వ్యతిరేక అల్లర్లను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. సిక్కులను హతమార్చిన గాంధీ కుటుంబ వారసుడితో సర్దార్ (సిక్కు) ఎప్పుడూ కరచాలనం చేయడని అన్నారు. వారు దేశద్రోహులు, దేశానికి శత్రువులు, దేశం గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడుతారని మండిపడ్డారు.

More Telugu News

Rahul Gandhi
Ravneet Singh Bittu
Congress
BJP
Parliament
India
Sikh
Politics
Defection