ఎలాన్ మస్క్ ట్వీట్ ను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్

  • కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ విమర్శలు
  • భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దన్న కిరణ్ రిజిజు
  • భారత విజయాలను తక్కువ చేయకూడదని వ్యాఖ్య

భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ... భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, విమర్శలు చేసేటప్పుడు దేశాన్ని కించపరచకూడదని ఆయన స్పష్టం చేశారు.


ఎక్స్‌ వేదికగా కిరణ్ రిజిజు స్పందిస్తూ... “సాధారణంగా భారతీయులు కాని వారి వ్యాఖ్యలపై నేను స్పందించను. కానీ రాహుల్ గాంధీ కళ్లు తెరిపించేందుకు ఎలాన్ మస్క్ వ్యాఖ్యను ఉటంకిస్తున్నాను. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్య హక్కే... కానీ భారత్‌ను కించపరచకూడదు. భారత విజయాలను ఎన్నడూ తక్కువ చేయకూడదు” అని రాశారు.


నిన్న ఎలాన్ మస్క్ ఒక లిస్ట్ షేర్ చేశారు. 2026లో చైనా, భారత్ కలిసి ప్రపంచ జీడీపీలో 43.6% ఉంటాయని, అమెరికా 9.9%తో మూడో స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ డేటా ఐఎంఎఫ్ నుంచి తీసుకున్నదని... ఆసియా-పసిఫిక్ ప్రాంతం ఈ ఏడాది చివరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 50% కంటే ఎక్కువ ఇస్తుందని మస్క్ రాశారు. “పవర్ బ్యాలెన్స్ మారుతోంది” అని ఆయన కామెంట్ చేశారు.


ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన మస్క్ భారత ఆర్థిక వ్యవస్థను దగ్గరగా ఫాలో అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని రెండుసార్లు కలిసిన ఆయన... ఆసియా ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతోందని ఈ ట్వీట్ ద్వారా సంకేతం ఇచ్చారు. భారత్ ఈ మార్పులో ముందుందని చెబుతున్నారు.


కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ నిన్న విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, హౌస్‌హోల్డ్ సేవింగ్స్ తగ్గిపోవడం వంటి అత్యవసర సమస్యలను బడ్జెట్ పట్టించుకోలేదని ఆయన అన్నారు. గతంలో ట్రంప్ చేసిన 'ఇండియా డెడ్ ఎకానమీ' వ్యాఖ్యను గుర్తుచేస్తూ రాహుల్ మాట్లాడారు.



More Telugu News