ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం చేయూత.. 4 లక్షల ఇళ్లకు పీఎంఏవై నిధులు

  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం
  • పట్టణాల్లో ఇంటికి రూ.1.50 లక్షలు.. గ్రామాల్లో రూ.72 వేల చొప్పున వాటా
  • రాష్ట్రవ్యాప్తంగా 4.13 లక్షల ఇళ్లకు కేంద్ర నిధులు అందే అవకాశం
  • ఆదివాసీల కోసం ప్రత్యేకంగా 10 వేల ఇళ్లు మంజూరు
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇళ్లకు కేంద్రం తన వాటాను అందించనుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున నిధులు సమకూరనున్నాయి. రాష్ట్రం ఆశించిన స్థాయిలో కాకపోయినా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పీఎంఏవై-అర్బన్ 2.0 పథకంలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి మొత్తం 1.13 లక్షల ఇళ్లను కేటాయించనుంది. ఇందులో ఇప్పటికే 10 వేల ఇళ్లు మంజూరు కాగా, మిగిలిన 1.03 లక్షల ఇళ్ల కోసం రూ.1,690 కోట్లు విడుదల చేయనుంది. ఇది కాకుండా గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి సుమారు 33 వేల ఇళ్లకు కేంద్రం తన వాటాగా మరో రూ.500 కోట్లు అందించే అవకాశం ఉంది.

ఇక, గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే, రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఇళ్లకు సహాయం అందించాలని కోరగా, ప్రస్తుతానికి పీఎంఏవై-గ్రామీణ్ కింద సుమారు 3 లక్షల ఇళ్లకు నిధులు వచ్చే అవకాశం ఉందని గృహనిర్మాణ శాఖ అంచనా వేస్తోంది. దీని ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.2,160 కోట్ల నిధులు అందనున్నాయి.

ఇదే పథకంలో భాగంగా ఆదివాసీల కోసం కేంద్రం ప్రత్యేకంగా 10,000 ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.1.20 లక్షల చొప్పున అందించనుంది. ఈ ఇళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే నిధులు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కానుంది.


More Telugu News