తిరుమలలో స‌రికొత్త టెక్నాలజీ.. భద్రత మరింత పటిష్ఠం

  • భద్రతపై టీటీడీ ఫోకస్.. తిరుమలలో ఏఐ కెమెరాల ఏర్పాటు
  • రద్దీని అంచనా వేసేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగం
  • ఘనంగా రామకృష్ణ తీర్థ ముక్కోటి.. పోటెత్తిన భక్తులు
  • అంగ‌రంగ‌వైభ‌వంగా గోవిందరాజస్వామి తెప్పోత్సవం
తిరుమలలో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను (ఎఫ్‌ఆర్‌సీ) ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసింది. గత నెలలో రథసప్తమి సందర్భంగా మాడవీధుల్లో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు భద్రతాపరమైన అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈ కెమెరాలను అనుసంధానించారు. ఈ టెక్నాలజీ సాయంతోనే డిసెంబర్, జనవరి నెలల్లో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో రికార్డుస్థాయి భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించినట్లు అధికారులు తెలిపారు.

ఘనంగా రామకృష్ణ తీర్థ ముక్కోటి
మరోవైపు శేషాచల అడవుల్లోని శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఆదివారం వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లిన అర్చకులు తీర్థంలోని శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడి విగ్రహాలకు పాలు, పెరుగు, చందనంతో విశేష అభిషేకాలు నిర్వహించారు. గతేడాది సుమారు 2,000 మంది భక్తులు రాగా, ఈ ఏడాది వారి సంఖ్య 5,000 దాటడం విశేషం. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేకంగా అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.

కన్నులపండువగా గోవిందరాజస్వామి తెప్పోత్సవం
ఇక, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి పుష్కరిణిలో తెప్పపై ఏడు చుట్లు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


More Telugu News