YSR Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో 227 గన్ లైసెన్సులు రద్దు

YSR Kadapa 227 Gun Licenses Cancelled
  • ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు
  • జిల్లాలో జారీ చేసిన మొత్తం 854 తుపాకీ లైసెన్స్‌లను సమగ్రంగా పరిశీలించిన అధికారులు
  • జిల్లా ఎస్పీ సిఫార్సుతో 227 లైసెన్సులను రద్దు చేసిన కలెక్టర్
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో  ఇష్టానుసారంగా జారీ చేసిన గన్ లైసెన్సులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో సమగ్ర విచారణ చేపట్టి,  227 తుపాకీ లైసెన్స్‌లను ఉన్నతాధికారులు రద్దు చేశారు. 

లైసెన్స్‌లు పొందిన కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారని, తుపాకులు చూపిస్తూ బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయం మీడియాలో రావడంతో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి, జిల్లాలో జారీ చేసిన మొత్తం 854 తుపాకీ లైసెన్స్‌లను సమగ్రంగా పరిశీలించారు. అర్హతలేమి, నేరపూరిత నేపథ్యం ఉన్నవారికి లైసెన్స్‌లు ఇచ్చారా అనే అంశాలపై విచారణ జరిపారు. 

ఈ విచారణలో దాదాపు 227 మంది లైసెన్స్‌దారులు వివిధ నేరాల్లో పాల్గొన్నట్లు తేలింది. వారిలో 11 మంది కరుడుగట్టిన నేరస్తులుగా గుర్తించగా, మరో ముగ్గురు నిబంధనలు ఉల్లంఘించి తుపాకులతో నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. దీంతో 227 గన్ లైసెన్స్‌లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఎస్పీ సిఫార్సు చేయగా, కలెక్టర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. 

తుపాకీ లైసెన్స్‌లు రద్దయినవారిలో జమ్మలమడుగుకు చెందిన వైసీపీ నేత మల్కిరెడ్డి హనుమంతరెడ్డి, పులివెందులలో కాల్పుల ఘటనలో ఉన్న భరత్ యాదవ్, వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెకు చెందిన నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే కమలాపురం మండలం అప్పాయపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ ఎం. శ్రీనివాసులరెడ్డి, కడప పట్టణం ఎస్‌బీఐ కాలనీకి చెందిన షేక్ జాకీర్ లైసెన్స్‌లను కూడా రద్దు చేశారు. పులివెందుల, కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో తుపాకీ లైసెన్స్‌లు రద్దయినట్లు తెలుస్తోంది. 
YSR Kadapa
Gun Licenses
Kadapa District
Andhra Pradesh
Illegal activities
Criminals
YCP Leader
Malkireddy Hanumantha Reddy
Bharat Yadav
Nimmakayala Sudhakar Reddy

More Telugu News