పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా
- రేపటి నుంచి కొనసాగాల్సిన పవన్ పిఠాపురం పర్యటన
- టౌన్, వార్డు, బూత్ స్థాయి పార్టీ ఎన్నికల నేపథ్యంలో పర్యటన వాయిదా
- తమ ప్రతినిధులను ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్న జనసైనికులు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన రేపు ప్రారంభం కావాల్సి ఉండగా, అకస్మాత్తుగా వాయిదా పడింది. పిఠాపురంలో పార్టీకి సంబంధించి టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీ ఎన్నికలు ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరగనుండటంతో, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. ఈసారి తొలిసారిగా సభ్యులే ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఓటింగ్ ద్వారా ఎన్నుకునే విధానాన్ని జనసేన అమలు చేస్తోంది. రేపు (జనవరి 28) నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.