మెటాపై తీవ్ర ఆరోపణలతో దావా.. వాట్సాప్ సురక్షితం కాద‌న్న‌ ఎలాన్ మస్క్

  • వాట్సాప్ ప్రైవసీ విధానంపై అమెరికా కోర్టులో దావా
  • యూజర్ల ప్రైవేట్ మెసేజ్‌లను మెటా యాక్సెస్ చేయగలదని ఆరోపణ
  • ఆరోపణలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసిన మెటా సంస్థ
  • వాట్సాప్ సురక్షితం కాదంటూ వివాదంలోకి ఎలాన్ మస్క్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ 'మెటా' చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

వాట్సాప్‌ ప్రైవసీపై తీవ్ర ఆరోపణలు.. కోర్టులో దావా!
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో ఈ నెల‌ 23న ఈ దావా దాఖలైంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాలకు చెందిన కొందరు యూజర్లు ఈ పిటిషన్ వేశారు. వారి ఆరోపణల ప్రకారం వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం కేవలం ఒక బూటకం. మెటా ఉద్యోగులు అంతర్గత టూల్స్ ఉపయోగించి యూజర్ల చాట్స్‌ను యాక్సెస్ చేయగలరని వారు ఆరోపించారు. యూజర్ ఐడీ ఆధారంగా ఇంజినీర్ల అనుమతితో మెసేజ్‌లను దాదాపు రియల్ టైంలో చూడొచ్చని, చివరకు డిలీట్ చేసిన కంటెంట్‌ను కూడా వీక్షించగలరని ఆరోపణల్లో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలకు మద్దతుగా పిటిషనర్లు ఎలాంటి సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పించలేదు.

ఆరోపణలను ఖండించిన మెటా
ఈ దావాను మెటా సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా తప్పుడు, అసంబద్ధమైన ఆరోపణలని కొట్టిపారేసింది. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ పకడ్బందీగా పనిచేస్తుందని, ఎన్‌క్రిప్షన్ కీలు కేవలం యూజర్ల డివైజ్‌లలోనే ఉంటాయని స్పష్టం చేసింది. అందువల్ల తాము గానీ, తమ ఉద్యోగులు గానీ మెసేజ్‌లను డీక్రిప్ట్ చేయడం లేదా చదవడం సాంకేతికంగా అసాధ్యమని మెటా పునరుద్ఘాటించింది.

వాట్సాప్ సురక్షితం కాదు: మస్క్
ఈ వివాదంలోకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ప్రవేశించారు. 'వాట్సాప్ సురక్షితం కాదు' అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన ఆయన, ఇతర ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల విశ్వసనీయతను కూడా ప్రశ్నించారు. దీనికి బదులుగా తమ 'ఎక్స్ చాట్' ఫీచర్‌ను ప్రయత్నించాలని యూజర్లకు సూచించారు. ఈ కేసు విచారణలో ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయోనని టెక్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


More Telugu News