Ponnam Prabhakar: గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రానిదే బాధ్యత... సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar blames central govt for gas petrol shortage
  • గ్యాస్, పెట్రోల్ సరఫరాను కేంద్రం తక్షణమే మెరుగుపరచాలన్న పొన్నం
  • ఈ కొరతపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
  • మూసీ ప్రాజెక్టుపై తుషార్ గాంధీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్య

ప్రస్తుతం నెలకొన్న గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.


దేశంలో నెలకొన్న గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రానిదే పూర్తి బాధ్యతని, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో కేంద్రం తక్షణమే స్పందించి సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఈ కొరతపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, వారు తమ బాధ్యతను విస్మరిస్తున్నారని విమర్శించారు.


మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విజన్ ఉందని, ఈ ప్రాజెక్టుపై ఉన్న అన్ని అనుమానాలను పీపీటీ ద్వారా నివృత్తి చేస్తామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందని, వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీకి మూసీ ప్రాజెక్టుపై ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.


బీజేపీకి రాష్ట్రంలో ఒక అజెండా, దేశంలో మరో అజెండా ఉందని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు.

Ponnam Prabhakar
Gas shortage
Petrol shortage
Central government
Telangana
Kishan Reddy
Bandi Sanjay
Moosi River
RTC
Fuel crisis

More Telugu News