Narayana: అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల్లో భూ సమస్య ఉంది: మంత్రి నారాయణ

Amaravati Seed Access Road Faces Land Acquisition Hurdles Says Narayana
  • సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల్లో 4.5 ఎకరాల సమస్య ఉందన్న నారాయణ
  • భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి చట్టపరంగా అవకాశం ఉందన్న మంత్రి
  • అయినప్పటికీ రైతులకు మరో నెల సమయం ఇస్తున్నట్టు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉండవల్లి వద్ద బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న అత్యాధునిక స్టీల్ బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించిన ఆయన, రాజధాని కనెక్టివిటీపై కీలక ప్రకటనలు చేశారు.


సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి ప్రధాన రహదారికి అనుసంధానించే క్రమంలో ఇంకా 4.5 ఎకరాల భూమికి సంబంధించిన సమస్య పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి చట్టపరంగా అవకాశం ఉన్నప్పటికీ, రైతులకు మరో నెల రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 9 నాటికి రైతులు స్వచ్ఛందంగా భూసమీకరణకు ముందుకు రాకుంటే, ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి దృష్ట్యా రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


స్టీల్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని... ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు హామీ ఇచ్చాయని మంత్రి తెలిపారు. బకింగ్‌హామ్ కెనాల్ కంటే ముందుగా గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై మరో రెండు స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయని... ఇవి కూడా పూర్తి అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టేనని చెప్పారు.

Narayana
Minister Narayana
Amaravati
Seed Access Road
Andhra Pradesh
Land Acquisition
Buckingham Canal
Steel Bridge
AP Capital
Mangalagiri

More Telugu News