రిపబ్లిక్ డే వేడుకల్లో రాహుల్, ఖర్గేలకు అవమానం జరిగింది: షర్మిల

  • బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం చేతకాదన్న వైఎస్ షర్మిల
  • ప్రజాస్వామ్యం, సోదరభావం కోసం రాహుల్ గాంధీ మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని వెల్లడి
  • దేశంలో బీజేపీ అనే చీకటి నుంచి కాంగ్రెస్ అనే వెలుగు ప్రజలకు కనిపిస్తుందని వ్యాఖ్య 
రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను అవమానించారని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఇందిరాభవన్‌లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో పాల్గొన్న ఆమె, బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం చేతకాదని, రాజ్యాంగ విలువలను విస్మరిస్తోందని మండిపడ్డారు. నిండు సభలో మహాత్మా గాంధీ, డా. బీఆర్ అంబేద్కర్‌లను అవమానించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, సోదరభావం కోసం రాహుల్ గాంధీ మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.

దేశంలో బీజేపీ అనే చీకటి నుంచి కాంగ్రెస్ అనే వెలుగు ప్రజలకు కనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న కొన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశాలు జరిగాయని, పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. త్వరలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఎంజీ నరేగా యథావిధిగా కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి రోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలోనే నిజమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. డీసీసీ నియామకాల్లో ఏపీలోనే కాక దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు. ఆ సమస్యలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, జిల్లా అధ్యక్షులు పని చేయకపోతే వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు. 


More Telugu News