'మన్ కీ బాత్' లో అనంతపురం గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ

  • మన్ కీ బాత్ లో అనంతపురం ప్రజల జల సంరక్షణ కృషిని ప్రశంసించిన మోదీ
  • 10కి పైగా జలాశయాల పునరుద్ధరణ, 7 వేల మొక్కలు నాటారని అభినందన
  • దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కితాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రజల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నప్పటికీ, అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జల సంరక్షణలో చూపిస్తున్న చొరవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కరవుకు చిరునామాగా మారిన ప్రాంతంలో సామూహిక కృషితో మార్పు తీసుకువస్తూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

2026 సంవత్సరంలో తొలిసారిగా జరిగిన 130వ 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా చాలా కాలంగా వర్షాభావ పరిస్థితులతో, నీటి కొరతతో అల్లాడుతోందని గుర్తుచేశారు. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి స్థానిక ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, స్వయంగా 'చేతను' అనే కార్యక్రమం ద్వారా జలాశయాల పునరుద్ధరణకు నడుం బిగించారని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటివరకు 10కి పైగా చెరువులు, కుంటలను పునరుద్ధరించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 7 వేలకు పైగా మొక్కలను నాటారని మోదీ వివరించారు. కరవు సీమలో పచ్చదనం నింపేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు వారు చేస్తున్న ఈ సామూహిక కృషి దేశానికే ఆదర్శమని ప్రశంసించారు.


More Telugu News