ఊతకర్రల సాయంతో నడుస్తూ కనిపించిన హృతిక్ రోషన్.. ఆందోళనలో ఫ్యాన్స్!

  • ఊతకర్రల సాయంతో పార్టీకి హాజరైన హృతిక్ రోషన్
  • ఆయన్ను చూసి ఆందోళన చెందుతున్న అభిమానులు
  • వైరల్ అవుతున్న హృతిక్ లేటెస్ట్ ఫొటోలు
బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ తన తాజా లుక్‌తో అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఇటీవల ఆయన ఊతకర్రల (crutches) సాయంతో నడుస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్‌మేకర్ గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకకు హాజరైన హృతిక్, పార్టీ ముగిశాక క్రచెస్‌ సాయంతో బయటకు వచ్చారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన ఆయన, ఫోటోగ్రాఫర్లకు పోజులివ్వకుండా మర్యాదపూర్వకంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

'సెనోరిటా' పాట షూటింగ్ సమయంలో హృతిక్ తీవ్ర నొప్పితో బాధపడ్డారు: బోస్కో మార్టిస్

హృతిక్ ఇలా గాయాలతో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నోసార్లు ఆయన శారీరక నొప్పులను భరిస్తూనే తన కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా 'జిందగీ నా మిలేగీ దుబారా' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'సెనోరిటా' షూటింగ్ నాటి ఓ ఆసక్తికర విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ బయటపెట్టారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని ఆయన తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో బోస్కో మాట్లాడుతూ.. "సెనోరిటా పాట షూటింగ్ చాలా కష్టంగా సాగింది. ఎందుకంటే ఆ సమయంలో హృతిక్ విపరీతమైన నొప్పితో ఉన్నారు" అని వెల్లడించారు. ఎంతో ఉత్సాహంగా, సరదాగా కనిపించే ఆ పాట వెనుక హృతిక్ తీవ్ర శారీరక శ్రమ దాగి ఉందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 


More Telugu News