తమిళనాడులో హిందీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ చోటు లేదు: సీఎం స్టాలిన్

  • భాషా అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం స్టాలిన్ నివాళి
  • తమిళనాడులో హిందీకి ఎప్పటికీ స్థానం లేదని స్పష్టీకరణ
  • హిందీ రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని మరోసారి ఉద్ఘాటన
  • అమరవీరులకు నివాళులర్పించిన పళనిస్వామి, విజయ్
తమిళనాడులో హిందీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ చోటు లేదని డీఎంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 'భాషా అమరవీరుల దినోత్సవం' సందర్భంగా గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారిని ఆయన స్మరించుకున్నారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని తమ రాష్ట్రం ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా స్టాలిన్ చెన్నైలోని భాషా అమరవీరులు తలముత్తు, నటరాజన్ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీఎండీఏ భవనంలో వారి విగ్రహాలను ఆవిష్కరించారు. "తమిళ భాషను ప్రాణంలా ప్రేమించే రాష్ట్రం, హిందీ రుద్దడాన్ని ఐక్యంగా ఎదుర్కొంది. ప్రతిసారీ అదే తీవ్రతతో నిరసన తెలిపింది" అని స్టాలిన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా హిందీ వ్యతిరేక ఉద్యమ చరిత్ర, డీఎంకే నేతలు సీఎన్ అన్నాదురై, ఎం. కరుణానిధి పాత్రను వివరిస్తూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు.

1964-65 మధ్యకాలంలో హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఆత్మార్పణం చేసుకున్న వారిని తమిళనాడు 'భాషా అమరవీరులు'గా గౌరవిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 ద్వారా హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందని డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో తమిళం, ఇంగ్లీష్ అనే ద్విభాషా సూత్రమే అమలవుతోంది.

మరోవైపు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్య‌క్షుడు విజయ్ కూడా భాషా అమరవీరులకు నివాళులు అర్పించారు. "తల్లి తమిళం మా ప్రాణంతో సమానం" అని పళనిస్వామి పేర్కొన్నారు.


More Telugu News