బంకర్ లో దాక్కున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

  • అమెరికా దాడి చేస్తుందనే భయంతో ఖమేనీ రక్షణకు అధికారుల ఏర్పాట్లు
  • టెహ్రాన్ లోని గుర్తుతెలియని ప్రాంతంలో ఉన్న బంకర్ లోకి తరలింపు
  • బంకర్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపేలా ఏర్పాట్లు ఉన్నట్లు సమచారం
ఇరాన్ ను యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా సైనిక బలగాలు ఇరాన్ వైపు కదులుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికా దాడి చేసే అవకాశం ఉండడంతో తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టారు.

ఖమేనీని గుర్తుతెలియని ప్రాంతంలో ఉన్న బంకర్ లోకి తరలించినట్లు సమాచారం. టెహ్రాన్ లోనే ఈ బంకర్ ఉన్నప్పటికీ కొంతమంది ఉన్నతాధికారులకు తప్ప అది ఎక్కడుందనే విషయం ఎవరికీ తెలియదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఖమేనీని ఉంచిన బంకర్ నుంచే టెహ్రాన్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేలా పలు సొరంగాలకు అనుసంధానించినట్లు తెలుస్తోంది.

సుప్రీం లీడర్ గా తన ఆఫీసు విధులు నిర్వర్తించేందుకు వీలుగా తన చిన్న కుమారుడు మసూద్ ఖమేనీకి బాధ్యతలు అప్పగించారని ఇరాన్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు తెలిపాయి. అయితే, ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు.


More Telugu News