ప్రపంచకప్‌ను బహిష్కరిస్తే.. పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలకు ఐసీసీ ప్లాన్?

  • టీ20 ప్రపంచకప్ వేదికపై ఐసీసీ, పీసీబీ మధ్య తీవ్ర వివాదం
  • ఐసీసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని పీసీబీ ఛైర్మన్ ఆరోపణ
  • టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్థాన్ హెచ్చరిక
  • పాక్‌పై కఠిన ఆంక్షలు విధించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నట్లు స‌మాచారం
2026 టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఐసీసీ మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ఐసీసీ తీరుపై పీసీబీ ఛైర్మన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీని బహిష్కరించే అవకాశం ఉందన్న సంకేతాలతో వివాదం ముదిరింది. ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే మార్చేసే కఠినమైన ఆంక్షలు విధించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వివాదానికి పీసీబీ ఛైర్మన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన మోహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలే కారణం. గతంలో పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించిన ఐసీసీ, ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ఐసీసీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నఖ్వీ ఆరోపించారు.

ఎన్డీటీవీ కథనం ప్రకారం పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వైఖరిపై ఐసీసీ తీవ్ర అసంతృప్తితో ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో కలిసి ఐసీసీపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం, ప్రపంచకప్‌ నుంచి వైదొలుగుతామని బహిరంగంగా సవాల్ చేయడాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది.

ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిజంగానే వైదొలగితే, గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఐసీసీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆంక్షల ప్రకారం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేయడం, ఆసియా కప్ నుంచి మినహాయించడం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనకుండా 'నో ఎన్‌ఓసీ' విధానాన్ని సభ్య దేశాలన్నీ పాటించేలా ఐసీసీ ఒత్తిడి తేనుంది. ఈ చర్యలు పీసీబీ ఆదాయాన్ని దెబ్బతీయడమే కాకుండా పాకిస్థాన్ జట్టును అంతర్జాతీయ క్రికెట్‌లో ఒంటరిని చేస్తాయి.


More Telugu News