నటి మాధవిలతపై సాయి భక్తుల ఐక్యవేదిక ఫిర్యాదు

  • షిరిడి సాయి బాబాపై మాధవిలత అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న ఐక్య వేదిక 
  • తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు ఫిర్యాదు 
  • మాధవిలత తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న రామచందర్ రావు  
సినీనటి, ఏపీ బీజేపీ నేత మాధవిలతపై షిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది. సాయి బాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఐక్య వేదిక డిమాండ్ చేసింది.

ఈ అంశంపై రామచందర్ రావు స్పందిస్తూ.. షిరిడి సాయి బాబాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం తగదని అన్నారు. ఆమె సాయి బాబాపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాధవిలత తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఎవరైనా సరే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని, ఇలాంటి వ్యాఖ్యలకు బీజేపీ మద్దతు ఉండదని, పార్టీ ఏకీభవించదని స్పష్టంగా తెలిపారు.

ఇదే సందర్భంగా షిరిడి సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఐక్య వేదిక హెచ్చరికలు జారీ చేసింది. వేదిక అధ్యక్షుడు మంచికంటి ధనుంజయ మాట్లాడుతూ.. సాయి బాబాపై లేనిపోని మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. సాయి బాబాపై జరుగుతున్న దుష్ప్రచారం సరైంది కాదని, సాయి బాబా ఆలయంలో జరిగేవన్నీ హిందూ సంప్రదాయ పూజలేనని, ఇతర పూజలు కాదని స్పష్టం చేశారు.

హిందువులను విడదీసే కుట్రలు చేయొద్దని, సాయి బాబాను, ఆయన భక్తులను హేళన చేయవద్దని కోరారు. హిందూ ధర్మాన్ని కూల్చే ప్రయత్నాలు తగవని హెచ్చరించారు. హిందూ సమాజాన్ని చీల్చేందుకు కొంత మందికి నిధులు అందుతున్నాయా ? అంటూ ప్రశ్నించారు.

సాయి భక్తులు సహనంతో ఉన్నారని, ఆ సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. కట్టర్ హిందువులు సాయి భక్తులేనని స్పష్టం చేశారు. సాయి బాబాను హేళన చేసిన ఘటనల్లో ఇప్పటికే 14 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మాధవిలత, భరత్ వర్ష, లలిత్ కుమార్‌లు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని ఆరోపించారు.

ఈ అంశంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. ప్రస్తుతం సహనంతో ఉన్నామని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సాయి భక్తుల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. 


More Telugu News