టీడీపీలో కోవర్టుల కలకలం.. చింతమనేని వ్యాఖ్యలతో రచ్చ

  • ఏలూరు జిల్లా కూటమిలో కోవర్టులున్నారన్న చింతమనేని
  • ఆయన వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి బహిరంగంగా స్పందన
  • పార్టీలో చేరికలపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని హితవు
  • దెందులూరు నియోజకవర్గంలోని నేతల చేరికపైనే చింతమనేని అసంతృప్తి
  • టీడీపీలో బహిర్గతమైన ఏలూరు జిల్లా నేతల విభేదాలు
తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కూటమి పార్టీల్లో కోవర్టులున్నారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏలూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి అదే వేదికపై స్పందించడంతో పార్టీలో నెలకొన్న అసమ్మతి బహిర్గతమైంది.

శుక్రవారం ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చింతమనేని మాట్లాడారు. "ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల్లో కొందరు కోవర్టులున్నారు. వారి కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుంది" అని ఆయన హెచ్చరించారు.

చింతమనేని వ్యాఖ్యలపై అక్కడే ఉన్న మంత్రి పార్థసారథి వెంటనే స్పందించారు. "టీడీపీలో చేరాలనుకునే వారి విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం. ఏదో ఒక నియోజకవర్గంలోని సమస్యను పట్టుకుని జిల్లా అంతటా కోవర్టులు ఉన్నారనడం పార్టీకి నష్టం కలిగిస్తుంది" అని హితవు పలికారు.

గతంలో వైసీపీలో ఉన్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు ఇటీవల టీడీపీలో చేరారు. దెందులూరు నియోజకవర్గానికి చెందిన వీరితో చింతమనేనికి విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


More Telugu News