విజయసాయి రెడ్డి ఏం చెప్పారోనని జగన్ భయపడుతున్నారు: పయ్యావుల కేశవ్
- ఈడీ ముందు తన పేరు ప్రస్తావించారేమోనని జగన్ కలవరపడుతున్నారన్న కేశవ్
- జగన్ ప్రశాంతత కోల్పోయారని వ్యాఖ్య
- రాజకీయ లబ్ధి తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శ
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణలో ఏం చెప్పారోనన్న భయంతో జగన్ కలవరపడుతున్నారని అన్నారు. ఈ కేసులో ఈడీ ముందు విజయసాయి తన పేరును ఎక్కడ ప్రస్తావించారో అన్న ఆందోళనతోనే జగన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ప్రశాంతత కోల్పోయిన జగన్ తన వ్యక్తిగత భయాన్ని ప్రజల బాధగా చిత్రీకరిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. క్రెడిబిలిటీ లేని వ్యక్తి క్రెడిట్ చోరీ అంటూ మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. తన బురదను ఎదుటివారిపై చల్లే ప్రయత్నాలు జగన్ ఇంకా మానలేదన్నారు.
పాసు పుస్తకాలపై రూ.700 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి తన ఫొటోలు వేసుకునే హక్కు జగన్ కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులపై తన బొమ్మలు ముద్రించుకోవడం దురహంకారమని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో దోపిడీకి తెరలేపింది జగన్ ప్రభుత్వమేనని ఆరోపించారు. రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని అన్నారు.
సొంత బాబాయిని హత్య చేసిన వారిని పార్టీలో చేర్చుకున్న వ్యక్తి జగన్ కాదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి తప్ప ప్రజా సంక్షేమం జగన్ కు పట్టదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులిముతూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.