Malaika Arora: మలైకాకు సిద్ధూ నుంచి కానుకలు.. కపిల్ శర్మ షోలో బయటపడ్డ సరదా సీక్రెట్!

Malaika Arora Receives Gifts from Sidhu Reveals Secret on Kapil Sharma Show
  • 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో'లో ఆసక్తికర విషయం చెప్పిన మలైకా
  • ప్రతి 15-20 రోజులకు తనకు సిద్ధూ వెన్న, బెల్లం పంపిస్తారని వెల్లడి
  • మలైకాపై అసూయగా ఉందంటూ కపిల్ శర్మ సరదా వ్యాఖ్యలు
  • సిద్ధూ గెటప్‌లో వచ్చిన సునీల్ గ్రోవర్.. మలైకాతో ఫ్లర్టింగ్
బాలీవుడ్ నటి మలైకా అరోరా, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య ఉన్న ఓ సరదా అనుబంధం గురించి బయటపడింది. ప్రముఖ టాక్ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో'లో పాల్గొన్న మలైకా మాట్లాడుతూ... సిద్ధూ ప్రతి 15-20 రోజులకు ఒకసారి తన కోసం ఇంటి నుంచి ప్రత్యేకంగా తెల్ల వెన్న (వైట్ మఖన్) పంపిస్తారని వెల్లడించారు.

షోలో హోస్ట్ కపిల్ శర్మ.. అమృత్‌సర్ ఫుడ్ గురించి మాట్లాడుతూ, "అక్కడి కుల్చాపై వేసే తెల్ల వెన్నను చూస్తే నాకు మీరే గుర్తొస్తారు" అని మలైకాతో అన్నారు. వెంటనే సిద్ధూ జోక్యం చేసుకుని, "మలైకా మ్యామ్, మా ఇంటి నుంచి మీకు ఏం వస్తుంది?" అని అడిగారు. దీనికి మలైకా బదులిస్తూ, "ప్రతి 15 లేదా 20 రోజులకు ఒకసారి, ఆయన తన ఇంటి నుంచి నాకు తెల్ల వెన్న, కొన్ని స్నాక్స్, బెల్లం పంపిస్తారు" అని తెలిపారు.

ఈ విషయం విన్న కపిల్ శర్మ సరదాగా అసూయ వ్యక్తం చేశారు. "సిద్ధూ గారు మీకు పరిచయమైంది గత ఏడాదే. అయినా ఇన్ని పంపిస్తున్నారు. నాకు ఆయన 20 ఏళ్లుగా తెలుసు. కనీసం సోంపు, బెల్లం ముక్క కూడా ఎప్పుడూ ఇవ్వలేదు" అని నవ్వులు పూయించారు. మలైకాను చూస్తే తనకు చాలా అసూయగా ఉందని కూడా కపిల్ అన్నారు.

ఇదే షోలో సిద్ధూ, మలైకాను "చాలా తుంటరి" అని ఆటపట్టించారు. ఆమె గురించి వాళ్ల అమ్మకు కూడా అంతగా తెలిసి ఉండదేమోనని కపిల్ చమత్కరించారు. చివర్లో, నటుడు సునీల్ గ్రోవర్.. సిద్ధూ గెటప్‌లో వచ్చి మలైకాకు రోజా పూలు ఇచ్చి ప్రపోజ్ చేస్తూ అందరినీ అలరించారు. తనను అద్భుతంగా అనుకరించిన సునీల్‌ను చూసి, "నీ ముందు నవజ్యోత్ ఫెయిల్ అయ్యాడు" అంటూ సిద్ధూ ప్రశంసించారు.


Malaika Arora
Navjot Singh Sidhu
Kapil Sharma Show
The Great Indian Kapil Sharma Show
Bollywood
White Butter
Amritsar Food
Sunil Grover

More Telugu News