రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు

  • ప్రజల ఖాతాల నుంచి రేవంత్ డబ్బులు తీసుకుంటున్నారన్న హరీశ్
  • హామీలపై మంత్రులను ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి ఉందని వ్యాఖ్య
  • డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ కావడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ప్రవర్తనకు, ఒక సైబర్ నేరగాడి ప్రవర్తనకు పెద్ద తేడా లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.


కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేశామని, కానీ రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజల ఖాతాల నుంచే డబ్బులు తీసుకుంటానంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు మంత్రులను నిలదీస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు పంపుతున్నారని విమర్శించారు.


తాను, కేటీఆర్... ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నిస్తున్నందు వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోమని, హామీల అమలుపై ప్రశ్నించడం ఆపేది లేదని స్పష్టం చేశారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ నీ బావమరిది కుంభకోణం బయటకు రాకుండా చూడాలనే ప్రయత్నమా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.


కాంగ్రెస్ మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటున్నారని, ఆ పార్టీ పని అయిపోయిందని హరీశ్ వ్యాఖ్యానించారు. ప్రజల ముందుకు రావడానికి కాంగ్రెస్ నేతలు జంకుతున్నారని చెప్పారు. “ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోం. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకూ మీ వెంటపడుతూనే ఉంటాం” అని అన్నారు.



More Telugu News