క్యాసినోలు, రికార్డింగ్ డ్యాన్సులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు: వరుదు కల్యాణి
- సంక్రాంతి పండుగను అడ్డంపెట్టుకుని విచ్చలవిడిగా వ్యవహరించారన్న కల్యాణి
- మహిళలు బట్టలు విప్పి నాట్యాలు చేయాలంటూ కూటమి నేతలు బూతులు మాట్లాడారని ఆరోపణ
- ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. సంక్రాంతి పండుగను అడ్డుపెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా కోడి పందాలు, క్యాసినోలు, రికార్డింగ్ డ్యాన్సులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఇది పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. మహిళల బట్టలు విప్పి నాట్యాలు చేయాలంటూ కూటమి నేతలు బూతులు మాట్లాడుతున్నా, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హోంమంత్రి అనితను ప్రశ్నించారు. నడిరోడ్డుపై నిందితులను ఊరేగించే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.
కూటమి నేతలకు ఒక న్యాయం, వైసీపీ నేతలకు మరో న్యాయమా అంటూ వరుదు కళ్యాణి నిలదీశారు. కూటమి పాలన అంటే క్యాసినో పాలనగా మారిపోయిందని, రికార్డింగ్ డ్యాన్సులకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మండిపడ్డారు. మేక లేదా కేక్ కట్ చేస్తే కేసులు పెడుతున్న ప్రభుత్వం... మనిషి పీక కోసినా, మహిళలను అవమానించినా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని దుయ్యబట్టారు.
ఈ విషయాలపై హోంమంత్రి అనిత తక్షణమే ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ అంటే తెలుగుదేశం కాదని, “తెలుగుదేశం డర్టీ పాలన”గా మారిందని వ్యాఖ్యానించారు.