సంజయ్ మంజ్రేకర్ పై మరోసారి ఫైర్ అయిన విరాట్ కోహ్లీ సోదరుడు

  • టెస్టు ఫార్మాట్ నుంచి కోహ్లీ రిటైర్ కావడంపై మంజ్రేకర్ విమర్శ
  • సులువైన వన్డే ఫార్మాట్ ఎంచుకున్నాడని వ్యాఖ్య
  • చెప్పడం సులువు, చేయడం కష్టమన్న కోహ్లీ సోదరుడు

మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి ఘాటుగా స్పందించారు. విరాట్ కోహ్లీపై మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెప్పడం ఎవరికైనా సులువేనని, కానీ చేయడమే అసలైన సవాలని వికాస్ వ్యాఖ్యానించారు.


విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి టాప్ ఆర్డర్ బ్యాటర్‌కు సులువైన వన్డే ఫార్మాట్‌ను ఎంచుకున్నాడంటూ ఇటీవల సంజయ్ మంజ్రేకర్ విమర్శలు చేశారు. ఫ్యాబ్-4లోని జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ తమ లోపాలను సరిదిద్దుకుని టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తున్నారని, అలాంటి సమయంలో కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పడం తనకు బాధ కలిగించిందని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా బాగుండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ నేపథ్యంలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేయడంతో వికాస్ స్పందించారు. తన ‘థ్రెడ్స్’ ఖాతాలో పోస్టు చేస్తూ, ‘‘క్రికెట్‌లో ఏది సులువైన ఫార్మాటో మిస్టర్ ఎక్స్‌పర్ట్ చెప్పగలరా? అలా చెప్పాలంటే మీరు అక్కడ ఉండాలి. ఏదైనా సరే... చెప్పడం సులువు, చేయడమే కష్టం’’ అంటూ మంజ్రేకర్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారు.



More Telugu News