తన రిటైర్‌మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సైనా నెహ్వాల్

  • మోకాలి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నానన్న సైనా నెహ్వాల్ 
  • శారీరకంగా ఆటకు సహకరించనప్పుడు దూరంగా ఉండటమే మంచిదని వెల్లడి
  • ప్రజలకు ఇప్పటికే విషయం అర్థమైపోయి ఉంటుందన్న సైనా నెహ్వాల్ 
బ్యాడ్మింటన్ నుంచి తన రిటైర్మెంట్‌పై స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న సైనా, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన పరిస్థితిని వెల్లడించారు. మోకాలి సమస్యతో తాను తీవ్రంగా బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. శారీరకంగా ఆటకు సహకరించనప్పుడు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డారు.

2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా, చివరిసారిగా 2023లో జరిగిన సింగపూర్ ఓపెన్‌లో పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఆమె కోర్టుకు దూరంగానే ఉన్నారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. రెండేళ్ల కిందటే తాను ఆడటం ఆపేశానని పేర్కొన్నారు. తనకు ఇష్టం ఉండటంతోనే ఈ క్రీడలోకి వచ్చానని, అయితే ఇప్పుడు ఆడటం లేదు కాబట్టి ప్రత్యేకంగా రిటైర్మెంట్ అని ప్రకటించాల్సిన అవసరం లేదని భావిస్తున్నానన్నారు. ఆట ఆడేంత శారీరక సామర్థ్యం లేనప్పుడు ఆగిపోవడమే మంచిదన్నారు.

రిటైర్మెంట్ నిర్ణయానికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా మోకాలి నొప్పి పెద్ద సమస్యగా మారిందని సైనా చెప్పారు. ఈ విషయాన్ని తన కోచ్‌, తల్లిదండ్రులకు కూడా స్పష్టంగా తెలిపినట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటన తాము చేయలేదన్నారు. అయితే, ప్రజలకు ఇప్పటికే విషయం అర్థమైపోయి ఉంటుందని, సైనా ఆడటం లేదని నెమ్మదిగా తెలుసుకుంటారని పేర్కొన్నారు. తన వీడ్కోలు అనేది పెద్ద విషయమేమీ కాదని భావిస్తున్నానన్నారు. 


More Telugu News