ఇండోనేషియా తీరుతో భారత్ అలర్ట్.. తెరపైకి పాక్ జేఎఫ్-17 జెట్లు

  • భారత్‌తో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం చివరి దశలో ఇండోనేషియా
  • అదే సమయంలో పాక్ నుంచి జేఎఫ్-17 జెట్ల కొనుగోలుపై చర్చలు
  • ఇస్లామాబాద్‌లో ఇండోనేషియా రక్షణ మంత్రి, పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ
  • ఇండోనేషియా తాజా వైఖరితో అప్రమత్తమైన భారత రక్షణ వర్గాలు
భారత్‌తో 450 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో ఇండోనేషియా మరోవైపు పాకిస్థాన్‌తో ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం చర్చలు జరపడం ఢిల్లీని అప్రమత్తం చేసింది. పాకిస్థాన్-చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్లపై జకార్తా ఆసక్తి చూపడంపై భారత రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల ఇండోనేషియా రక్షణ మంత్రి స్జాఫ్రీ స్జాంసోద్దీన్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో పర్యటించారు. అక్కడ పాక్ వైమానిక దళ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సుమారు 40 జేఎఫ్-17 బ్లాక్-III ఫైటర్ జెట్లు, డ్రోన్లు, ఇతర సైనిక వ్యవస్థల కొనుగోలుపై చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వార్తలతో భారత వ్యూహాత్మక వర్గాల్లో కలవరం మొదలైంది.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఇండోనేషియా రక్షణ శాఖ స్పందించింది. పాక్‌తో చర్చలు సాధారణ రీతిలోనే జరిగాయని, ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై మాత్రమే మాట్లాడామని స్పష్టం చేసింది. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని ఇండోనేషియా రక్షణ శాఖ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ రికో రికార్డో సిరైత్ తెలిపారు.

భారత్‌ను ఇండోనేషియా కీలక వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్న సమయంలోనే, పాకిస్థాన్‌తో రక్షణ ఒప్పందాలకు మొగ్గు చూపడం గమనార్హం. ఒకేసారి రెండు దేశాలతో చర్చలు జరపడం ద్వారా ఇండోనేషియా తన సైనిక అవసరాల కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త పరిణామాలు భారత్-ఇండోనేషియా బ్రహ్మోస్ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.


More Telugu News