జర్మనీలో ఖర్చులు ఇలా ఉంటాయి...కానీ! ఓ విద్యార్థి ఏం చెబుతున్నాడో వినండి!

  • జర్మనీలో జీవన వ్యయంపై అంతర్జాతీయ విద్యార్థి పోస్ట్ వైరల్
  • నెలకు రూ.1.9 లక్షల జీతం వచ్చినా ఖర్చులు పోను మిగిలేది తక్కువేనని వెల్లడి
  • అద్దె, కిరాణా, రవాణాకే అధిక మొత్తం ఖర్చవుతుందని వివరణ
  • అయితే స్థిరత్వం, భద్రత కోరుకునేవారికి జర్మనీ సరైనదని సూచన
జర్మనీకి చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్కడ జీవన వ్యయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జర్మనీలో ఉంటున్న మీసుమ్ అబ్బాస్ అనే విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ పోస్ట్ ఇప్పుడు ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది. జర్మనీలోని వాస్తవ ఆదాయం, ఖర్చుల గురించి అతను వివరంగా చెప్పిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది.

మీసుమ్ అబ్బాస్ లెక్క ప్రకారం, జర్మనీలో సగటున ఏడాదికి 30,000 యూరోల జీతం వస్తే, అన్ని పన్నులు పోను నెలకు చేతికి అందేది సుమారు 2,100 యూరోలు (దాదాపు రూ. 1.9 లక్షలు). అయితే, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని అతడు వివరించాడు. 

నెలవారీ ఖర్చుల వివరాలను అతడు ఇలా పంచుకున్నాడు: 
అద్దె: 800 - 1,200 యూరోలు 
కిరాణా సరుకులు: 250 - 350 యూరోలు 
రవాణా: 150 - 250 యూరోలు 
ఇతర బిల్లులు (కరెంట్, నీరు): 150 - 200 యూరోలు 
ఫోన్ బిల్లు: 20 - 40 యూరోలు

ఈ ఖర్చులన్నీ పోగా నెల చివరికి కేవలం 150 నుంచి 200 యూరోలు (రూ. 13,000 - 18,000) మాత్రమే మిగులుతాయని మీసుమ్ తెలిపాడు. "పూర్తి సమయం పనిచేసి, పన్నులు కట్టినా నెలాఖరుకి ఇంతే మిగులుతుంది. జీతంలో సగం ఆదా చేయాలనుకుంటే మీ బడ్జెట్‌ను మళ్లీ చూసుకోండి" అని సూచించాడు.

అయితే, జర్మనీలో అధిక పన్నులకు బదులుగా బలమైన సామాజిక భద్రత లభిస్తుందని ఈ విద్యార్థి గుర్తుచేశాడు. ఉచిత వైద్యం, నిరుద్యోగ బీమా, బలమైన కార్మిక చట్టాలు, ఉద్యోగ భద్రత వంటివి జర్మనీలో ఉన్నాయని తెలిపాడు. "ఇది అమెరికన్ డ్రీమ్ కాదు, జర్మన్ స్థిరత్వం. ఇక్కడ అమెరికాలో లాగా వైద్య ఖర్చులతో దివాలా తీసే పరిస్థితి ఉండదు. ఇది ఫిర్యాదు కాదు, వాస్తవం. జర్మనీలో అవకాశాల కంటే భద్రత ఎక్కువ" అని తన పోస్ట్‌లో స్పష్టం చేశాడు.


More Telugu News